జస్టిస్ ఫర్ దిశ.. మిన్నంటుతున్న నిరసనలు
జస్టిస్ ఫర్ దిశ అంటూ తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. దిశకు మద్దతుగా సామాన్యులు, మహిళలు, యువత అంతా ముందుకు కదులుతున్నారు. నిందితులను నడి రోడ్డుపై ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
దిశ దారుణ హత్యపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని.. అత్యాచారాలు చేయాలంటేనే భయపడేలా శిక్ష ఉండాలి అంటూ మహిళా లోకం కథం తొక్కుతోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటి దగ్గర క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిందితులను సత్వరమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మరే మహిళకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని నినాదాలు చేశారు. దిశ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ర్యాలీలో పాల్గొన్న మహిళలు నినదించారు.
అటు ఈ ఘటనపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. డాక్టర్ దిశ హత్య కేసులో దోషులను బహిరంగ ప్రజా కోర్టులో శిక్షించాలని డిమాండ్ చేశారు.
దిశ కేసు మృగాళ్లకు ఓ గుణ పాఠం కావాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రఘునందనరావు అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దిశ హంతకులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దిశ హత్యకు నిరసనగా హైదరాబాద్‌లో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువతులు.. న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దిశను హత్య చేసిన నిందితులకు వెంటనే శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలులో మహిళా నేతలు నిరసనలు తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మహిళా నేతలకు దిశకు నివాళులర్పించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒంగోలు బైపాస్ రోడ్డులో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులు మావనహారం నిర్వహించి కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.
ఖమ్మం జిల్లా కొణిజర్లలో జెడ్పీ హైస్కూలు విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. దిశను హత్య చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించాలని ప్రతిజ్ఞ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థినులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. దిశను హత్య చేసిన వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో వైఎస్సార్ క్రాంతి పథం మహిళలు ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. దిశ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. మహిళలపై ఎలాంటి దాడులు జరిగినా ఊరుకునేది లేదని చెప్పారు.