గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించండి : మంత్రి సత్యవతి రాథోడ్

గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి కరోనా వైరస్ రాకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని, కోవిడ్- 19 వ్యాధి లక్షణాల పట్ల అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల విద్యాలయాల అధికారులు, ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలిచ్చారు.  నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో కరోనాపై మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. గురుకుల పాఠశాలల్లో, ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తప్ప మిగిలిన వారికి సెలవులిచ్చినందున, ఎక్కువ మంది విద్యార్థులను ఒకే గదిలో ఉంచకుండా, ఎక్కువ గదుల్లో తక్కువ మంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన విద్యా సంస్థల్లో విద్యార్థులకు కరోనా వైరస్ పట్ల పూర్తి అవగాహన కల్పించాలన్నారు.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రత పై ఎక్కువ శ్రద్ధ పెట్టేలా చూడాలన్నారు.