కరోనా వైరస్ ప్రభావంతో ఇపుడు హ్యాండ్ శానిటైజర్ల ప్రాధాన్యత మరింత పెరిగిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌కి మందు లేకపోవడం..నివారణ ఒక్కటే అందరిముందున్న మార్గం కావడంతో పరిశుభ్రత కోసం హ్యాండ్ శానిటైజర్లను వాడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఐఐటీ-హైదరాబాద్‌కు చెందిన రీసెర్చ్ కాలర్ తక్కువ ఖర్చుతో హ్యాండ్ శానిటైజర్లను తయారు చేశారు.
ఐఐటీ హైదరబాద్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటల్లర్జికల్ ఇంజినీరింగ్ లో రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ శివకళ్యాని అడెపు..70 శాతం ఐసోప్రొపనోల్, గ్లిసరాల్, పాలీప్రొపిలీన్ గ్లైకాల్ మిశ్రమంతో హ్యాండ్ శానిటైజర్‌ను తయారు చేశారు. ఈ శానిటైజర్ ద్రావణం కణత్వచంలోకి చొచ్చుకుపోయి సూక్ష్మజీవులు చనిపోతాయి. ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ హ్యాండ్ శానిటైజర్‌ను తయారు చేశాం. మార్కెట్‌లో దొరికే కమర్షియల్ శానిటైజర్ల నుంచి విముక్తి కల్పిండానికి దోహదపడుతుంది. అంతేకాదు వాటికంటే ఈ హ్యాండ్ శానిటైజర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని డాక్టర్ శివకళ్యాణి అడెపు తెలిపారు. ఇప్పటికే క్యాంపస్‌లో స్టాప్, ఫ్యాకల్టీ, లాంజ్, కేఫ్, మీటింగ్ హాల్స్, ల్యాబొరేటరీల్లో 10 లీటర్ల హ్యాండ్ శానిటైజర్‌ను వాడుతున్నామని వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ కళ్యాని అడెపు చెప్పారు.