పోలీస్ బృందంపై దాడి చేసిన 150 మందిలో 42 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బరేలీ జిల్లా కరంపూర్ చౌదరి ప్రాంతం ఇజ్జత్‌నగర్‌లో గడిచిన సోమవారం రాత్రి లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు ఇద్దరు పోలీసులు వెళ్లారు. వీరిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న ఐపీఎస్ అధికారి అభిషేక్ వర్మ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాదాపు 150 మంది దాడికి పాల్పడ్డారు. చేసేది లేక పోలీసులు లాఠిఛార్జి ప్రయోగించారు.
పోలీసులపై దాడి చేయడం, పోలీస్ ఔట్‌పోస్టును తగులబెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డట్లు ఎస్పీ రవీంద్ర కుమార్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 42 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరిలో ముగ్గురు మహిళలు బెయిల్‌పై విడుదలైనట్లు చెప్పారు. దాడిలో ఐపీఎస్ అధికారి వర్మ గాయపడ్డట్లు ఎస్పీ తెలిపారు.